ట్రంప్ జెరుసలేం ప్రకటనపై నిరసనలు

ట్రంప్ జెరుసలేం ప్రకటనపై నిరసనలు

  రియాద్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నిర్ణయాలతో ముస్లిం దేశాలు అతలాకుతలమవుతున్నాయి. అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ట్రంప్.. ఆరు ముస్లిం దేశాల వలసవాదులపై నిషేధం విధించారు. తాజాగా ఇజ్రాయిల్ రాజధాని జెరుసలేం అని ట్రంప్ ప్రకటించడంతో అరబ్ దేశాలు ఊగిపోతున్నాయి. జెరుసలేంపై డోనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనను సౌదీ అరేబియా తీవ్రంగా ఖండించింది. దీనిపై గల్ఫ్ కింగ్‌డమ్ ఓ ప్రకటన కూడా జారీ చేసింది. ట్రంప్ ప్రటకన అర్థరహితంగా, బాధ్యతారహితంగా ఉందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. కానీ ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమెన్ నెతన్యూ మాత్రం ఆ ప్రకటనను చరిత్రాత్మకం అని వర్ణించారు. ఒకే ఒక ప్రకటనతో అమెరికా విదేశీ విధానాన్ని ట్రంప్ మార్చేశారన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. మరోవైపు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఉన్న 15 సభ్యదేశాలు ట్రంప్ ప్రకటనపై అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశాయి.

 ట్రంప్ ప్రకటన చేయకముందే గాజాలో ఆయనకు వ్యతిరేకంగా నిరసనలు జరిగాయి. ట్రంప్ నరకానికి ద్వారం తెరిచారని ఇస్లామిస్ట్ హమాస్ సంస్థ ఓ ప్రటకన చేసింది. ఇస్తాంబుల్‌లోని అమెరికా ఎంబసీ ముందు కూడా భారీ ప్రదర్శన చేపట్టారు. అమెరికా తన వైఖరిని అకస్మాత్తుగా మార్చుకున్నదని సౌదీ రాయల్ కోర్టు అభిప్రాయపడింది. ముస్లింల పట్ల అమెరికా వ్యక్తం చేస్తున్న నిర్ణయాలను ఖండించాలని మలేషియా ప్రధాని నజీబ్ రజాక్ పిలుపునిచ్చారు. ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యూ... తాజా ప్రకటన పట్ల ట్రంప్‌కు థ్యాంక్స్ తెలిపారు. జెరసలేం ఎప్పటికీ మా రాజధాని అని మరోవైపు పాలస్తీనా అధ్యక్షుడు అబ్బాస్ స్పష్టం చేశారు. వివిధ ప్రపంచ దేశాలు కూడా భిన్నంగా స్పందించాయి.