ఉత్తర కొరియాపై ఒత్తిడి తీసుకురావాలి

ఉత్తర కొరియాపై ఒత్తిడి తీసుకురావాలి

  వాషింగ్టన్‌ : అణు కార్యక్రమం విషయంలో ఉత్తర కొరియాపై ఒత్తిడి తీసుకురావడానికి నిబద్ధతను అమెరికా, చైనాలు పునరుద్ఘాటించాయని అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది. ప్రస్తుతం చైనా విదేశాంగ మంత్రి యాంగ్‌ జియిచి రెండు రోజుల పాటు వాషింగ్టన్‌లో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా అమెరికా విదేశాంగ మంత్రి రెక్స్‌ టిల్లర్‌సన్‌తో ఆయన చర్చలు జరపనున్నారు. అత్యంత కీలకమైన అమెరికా-చైనా ఆర్థిక సంబంధాలపై ఇరువురు నేతలు చర్చిస్తారని భావిస్తున్నారు. ఇటీవల ఇరు దేశాలు దెబ్బకు దెబ్బ తీసుకునేలా చర్యలు తీసుకోవడంతో వాణిజ్య యుద్ధం ప్రారంభమవుతుందని అందరూ ఆందోళన చెందారు. 

అమెరికా విదేశాంగ ప్రతినిధి హీతర్‌ నారెట్‌ పత్రికా సమావేశంలో మాట్లాడుతూ, ఉత్తర కొరియా అణు కార్యక్రమాన్ని నిలువరించేలా ఒత్తిడి తీసుకురావాల్సిందేనని ట్రంప్‌, జిన్‌పింగ్‌లు స్పష్టం చేసినట్లు తెలిపారు. ఇరు దేశాల మధ్య గల అభిప్రాయ భేదాలను పరిష్కరించుకునేందుకు, పరస్పర సవాళ్ళపై సహకారం పెంచుకునేలా చర్యలు తీసుకునేందుకు, నిర్మాణాత్మక, విలువలతో కూడిన సంబంధాలు కొనసాగించాల్సిన ప్రాధాన్యతపై టిల్లర్‌సన్‌, యాంగ్‌లు అంగీకరించారని నారెట్‌ తెలిపారు. సక్రమమైన, ద్వైపాక్షిక ఆర్థిక సంబంధాలు నెలకొల్పే దిశగా చర్చలు జరపాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. ఉత్తర కొరియా విషయంలో చైనా మరింత ఎక్కువగా చొరవ తీసుకోవాలని తాము ఆశిస్తున్నట్లు నారెట్‌ చెప్పారు.