వేగంగా వ్యాపిస్తోన్న కార్చిచ్చు

వేగంగా వ్యాపిస్తోన్న కార్చిచ్చు

 లాస్‌ ఏంజిల్స్‌: అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో చెలరేగిన కార్చిచ్చు వేగంగా వ్యాపిస్తూ పొగతో కమ్మేస్తుంది. 'మెండోసినో కాంప్లెక్స్‌ ఫైర్‌'గా పిలుస్తున్న ఈ కార్చిచ్చు వల్ల పసిఫిక్‌ ప్రాంతం నుండి రాకీ పర్వతాల వరకు దట్టమైన పొగ ఆవరించిందని పేర్కొంది. గత వారం రోజులుగా సుమారు 1,87వేల ఎకరాల అడవిని కాల్చివేసిందని అమెరికా జాతీయ అగ్నిమాపక సంస్థ తెలిపింది. లేక్‌ ఎల్సినోర్‌ నగరానికి సమీపంలో క్లీవెలాండ్‌ జాతీయ అడవిలో మంటలు విపరీతంగా వ్యాపిస్తున్నాయి. గురువారానికి ఈ మంటలు దక్షిణ కాలిఫోర్నియాలోని నివాసాలకు చాలా సమీపంగా వచ్చేయడంతో హుటాహుటిన 20వేల మందిని అక్కడి నుంచి ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 

కొందరు ఇళ్ల యజమానులు మాత్రం అక్కడే ఉండి మంటల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. తమ ఇళ్లను కాపాడుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు నిరంతరాయంగా కృషి చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. సిబ్బంది, హెలికాప్టర్లు సహాయంతోనూ మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. కాలిఫోర్నియా చరిత్రలోనే ఇది అత్యంత పెద్ద కార్చిచ్చు అని భావిస్తున్నారు. ఈ దావానలం వల్ల దట్టమైన పొగలు వ్యాపిస్తున్నాయి.సమీపంలోని ప్రాంతాలన్నీ దట్టమైన పొగలతో నిండిపోయాయి. చెట్లు, గడ్డి, పొదలు మండుతుండడం వల్ల గాలి విపరీతంగా గాలి కాలుష్యమవుతోంది.

కాలిఫోర్నియాను కమ్మేసిన కార్చిచ్చు కారణంగా రాష్ట్రంలో ఎయిర్‌ క్వాలిటీ అలెర్ట్‌ను విధించినట్లు అధికారులు తెలిపారు. ప్రమాద స్థలం నుంచి వెలువడుతున్న పొగ వల్ల కంటి, శ్వాసకోశ సంబంధ వ్యాధులు వచ్చే అవకాశముందని అమెరికా డిసీజ్‌ కంట్రోల్‌ సెంటర్‌ హెచ్చరించింది. ముఖ్యంగా హృద్రోగులు, చిన్న పిల్లలపై పొగ ప్రభావం ఎక్కువగా ఉంటుందని పేర్కొంది. ఈ ప్రమాదం కారణంగా రాష్ట్రం మరింత కాలుష్యంతో నిండిపోయిందని వాతావరణ నిపుణుడు స్టీవెన్‌ డిమార్టినో అన్నారు. కాగా, ప్రస్తుతం అమెరికాలో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్న నేపథ్యంలోనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.