విదేశాంగ మంత్రిపై ట్రంప్‌ వేటు

విదేశాంగ మంత్రిపై ట్రంప్‌ వేటు

  వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తమ విదేశాంగ మంత్రి రెక్స్‌ టిల్లర్‌సన్‌కు ఉద్వాసన పలికారు. టిల్లర్‌సన్‌ స్థానంలో సిఐఎ డైరెక్టర్‌ మైక్‌ పాంపియోను ట్రంప్‌ ఎంపిక చేసుకున్నారు. కొత్త విదేశాంగ మంత్రిగా పాంపియో అద్భుతంగా పని చేస్తారని ట్రంప్‌ ట్విట్టర్‌లో ప్రకటించారు. ఈ నియామకానికి అమెరికా సెనేట్‌ ఆమోదం తెలిపాల్సి ఉంది. సిఐఎ డిప్యూటీ డైరెక్టర్‌గా ఉన్న గినా హాస్పెల్‌ను ఆ సంస్థకు కొత్త అధిపతిగా ఎంపిక చేశారు. ఈ పదవిలో ఒక మహిళను నియమించడం ఇదే మొదటిసారి. ప్రస్తుతం టిల్లర్‌సన్‌ ఆఫ్రికా పర్యటిస్తున్నారు. గత ఏడాది ఫిబ్రవరి 1న ఆయన విదేశాంగ మంత్రిగా నియమితులయ్యారు.

కొంతకాలంగా ట్రంప్‌కు, టిల్లర్‌ సన్‌కు మధ్య విభేదాలు వచ్చాయి. వీరి వాగ్వివాదాలు సాగాయి. అమెరికా గూఢచార సంస్థ సిఐఎ డైరెక్టర్‌గా ట్రంప్‌ ఎంపికచేసిన గినా హాస్పెల్‌ నేపథ్యమంతా వివాదాలమయం. హాస్పెల్‌ థారులాండ్‌లో కొనసాగించిన రహస్య ఆపరేషన్లు, నిర్బంధితులను చిత్రహింసలకు గురిచేసిన తీరు తీవ్ర విమర్శలకు గురైంది. 2002లో బ్లాక్‌సైట్‌ జైలులో అనుమానిత అల్‌ ఖైదా ఉగ్రవాదుల నుంచి వివరాలు రాబట్టేందుకు అమలుచేసిన క్రూర చిత్రహింసలు ఆమె సారథ్యంలోనే సాగాయి. ఆ వీడియో ఆధారాలను ధ్వంసం చేశారనే ఆరోపణలూ ఆమెపై వచ్చాయి. ఆమె 1985లో సిఐఎలో చేరి వివిధ దేశాల్లో గూఢచారిగా కోవర్టు ఆపరేషన్లలో పాల్గని పదోన్నతులు పొందారు.