విదేశీ శాస్త్ర పరిశోధనలపై ఫిలిప్పైన్స్‌ నిషేధం

విదేశీ శాస్త్ర పరిశోధనలపై ఫిలిప్పైన్స్‌ నిషేధం

 మణిలా: తమ దేశంలో పసిఫిక్‌ తీర ప్రాంతంలో కొనసాగుతున్న అన్ని రకాల విదేశీ శాస్త్ర పరిశోధనలపై నిషేధం విధిస్తున్నట్లు అధ్యక్షుడు రోడ్రిగో డ్యూటెర్ట్‌ ప్రకటించారు. తీర ప్రాంతంలో అనుమతి లేని నౌకలు కన్పిస్తే తరిమి కొట్టాలని ఆయన నౌకాదళాన్ని ఆదేశించారు. ఇప్పటికే చైనాతో సముద్ర తీర ప్రాంత పరిశోధనలపై ఒప్పందం కుదుర్చుకున్న ఫిలిప్పైన్స్‌ అధ్యక్షుడు జారీ చేసిన తాజా ఆదేశాలు వివాదాస్పదంగా మారాయి. అధ్యక్షుడు డ్యూటెర్ట్‌ ఈ ఆకస్మిక చర్యపై ప్రభుత్వం నుండి ఎటువంటి వివరణా వెలువడలేదు. ఇటీవలి కాలంలో చైనాతో మరింత సాన్నిహిత్యం పెంచుకుంటూ ఆ దేశం నుండి రుణాలు, పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్న డ్యుటెర్ట్‌ చేసిన ఈ ప్రకటన పలు దేశాలకు విస్మయం కలిగించింది.

2012లో 'ఫిలిప్పైన్స్‌ పగడపుదీవి'గా ఐరాస ప్రకటించిన బెన్‌హమ్‌ రైజ్‌ ప్రాంతాన్ని ఫిలిప్పైన్స్‌ ప్రభుత్వం గత ఏడాది 'ఫిలిప్పైన్స్‌ రైజ్‌'గా పేరు మార్చిన విషయం తెలిసిందే. దీనిపై సోమవారం జరిగిన కేబినెట్‌ భేటీలో అధ్యక్షుడు డ్యూటెర్ట్‌ మాట్లాడుతూ ఫిలిప్పైన్స్‌ రైజ్‌ తమదేనని, ఇప్పటి వరకూ ఈ ప్రాంతంకోసం ఎవరు ఏ ప్రయత్నాలు చేసినా వాటికి ఇప్పటితో తెరపడాల్సిందేనని స్పష్టం చేశారు. దాదాపు గ్రీస్‌ అంత వైశాల్యంలో వుండే ఈ ప్రాంతంలో జీవ వైవిధ్యంతోపాటు టునా చేపలు పుష్కలంగా లభిస్తాయి. అమెరికా, జపాన్‌ శాస్త్రవేత్తలు ఈ ప్రాంతాన్ని పలుమార్లు సర్వే చేశారు. అయితే ఈ ప్రాంతంపై పరిశోధనల కోసం గత 17 ఏళ్ల కాలంలో 18 సార్లు అధికారికంగా చైనా విజ్ఞప్తి చేసినప్పటికీ ఫిలిప్పైన్స్‌ నేతలు వాటిని పక్కన పెట్టారు.

ఈ ప్రాంతంలో తమ శాస్త్ర పరిశోధనలకు అనుమతించాలంటూ చైనా ఇటీవల మరోసారి విజ్ఞప్తి చేసింది. చైనాతో సాన్నిహిత్యం కోసం ప్రయత్నిస్తున్నప్పటికీ దీనిని ఏ మాత్రం పట్టించుకోని డ్యూటెర్ట్‌ తీర ప్రాంతంలో అనధికారికంగా ఎటువంటి నౌకలు పడవలు కన్పించినా వాటిని తరిమి కొట్టాలని ఆదేశించారు. ఈ ప్రాంతంపై పెట్రోలింగ్‌ నిర్వహించాలని ఆయన వాయుసేనకు సూచించారు. జాతీయ భద్రతను దృష్టిలో వుంచుకుని అధ్యక్షుడు ఈ ఆదేశాలు జారీ చేసినట్లు అధ్యక్షభవనం ప్రతినిధి హారీ రోక్‌ వివరించారు. ఈ ప్రాంతంలో చైనా ఫిలిప్పైన్స్‌ శాస్త్రవేత్తలు ఉమ్మడిగా పరిశోధనలు చేస్తారంటూ ఇటీవలి చైనా పర్యటనలో డ్యూటెర్ట్‌ చేసిన వ్యాఖ్యలపై రోక్‌ ఎటువంటి వివరణా ఇవ్వలేదు. కాగా దీనిపై చైనా ప్రభుత్వం వెంటనే స్పందించలేదు.