యాంత్రీకరణపై కార్మికుల ఆగ్రహం

యాంత్రీకరణపై కార్మికుల ఆగ్రహం

  కాలిఫోర్నియా : పని ప్రదేశాల్లో యాంత్రీకరణ పెరుగుతున్న నేపథ్యంలో కార్మికులు ఆ యంత్రాలను, యాంత్రీకరణను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రోబో కార్లపై కార్మికులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తూ వాటి విధ్వంసానికి కూడా దిగుతున్నారని కాలిఫోర్నియాలో ఈ ఏడాది దాఖలైన క్రాష్‌ నివేదికలు పేర్కొంటున్నాయి. డ్రైవర్‌ లేకుండా నడిచే కార్లపై దాడి జరిగిన సంఘటనలు ఈ ఏడాదిలో ఇప్పటికి ఆరు చోటు చేసుకున్నాయి. జనవరిలో శాన్‌ఫ్రాన్సిస్కోలో ఒక దాడి సంఘటన జరిగింది. జనరల్‌ మోటార్స్‌ క్రూయిజ్‌ డ్రైవర్‌లెస్‌ కారు విభాగం నిర్వహిస్తున్న ఒక వాహనం గ్రీన్‌ సిగల్‌ కోసం ఎదురుచూస్తోంది. 'నడవరాదు' అనే సంకేతం కనిపిస్తున్నా దాన్ని ఉల్లంఘించి వచ్చిన ఒక వ్యక్తి కోపంగా అరుస్తూ వచ్చి ఆ వాహనంపై దాడి చేశాడని నివేదిక పేర్కొంది. 

కాలిఫోర్నియా మోటారు వాహనాల విభాగం ఈ నివేదికను రూపొందించింది. అదే నెల్లో జరిగిన మరో సంఘటనలో టాక్సీ డ్రైవర్‌ తన వాహనంతో వేగంగా వచ్చి క్రూయిజ్‌ ఎవిని ఢ కొన్నాడని, ముందు కిటికీని కూడా బద్దలు కొట్టాడని ఆ నివేదిక పేర్కొంది. ఇటు వంటి ఆరు సంఘటనలు జరగాయని, వాటిలో మూడు ఆటోమేటిక్‌గా నడిచే వాహనాలని తెలిపింది. భద్రంగా వాహనాన్ని నడిపే సుశిక్షితుడైన డ్రైవర్‌ వుంటేనే ఆటోమేటిక్‌ వాహనాలను వారికి అప్పగిస్తామనే నిబంధనలు ఇప్పటివరకు వున్నాయి. ఏప్రిల్‌2 నుండి పరిస్థితి మారనుంది. కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. భద్రత నిమిత్తం కారులో వ్యక్తి లేకపోయినా సెల్ఫ్‌ డ్రైవింగ్‌ కార్లు రోడ్లపైకి రావడానికి అనుమతిస్తారు.